Wednesday, May 1, 2024
42.7 C
Nellore
More
    - Advertisement -

    బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు

    గంటల కొద్దీ తప్పని నిరీక్షణలు -పీలేరు: ప్రయాణికులకు నిత్యం సేవలు అందిస్తూన్న రోడ్డు రవాణా సంస్థ బస్సులు సకాలంలో రాక, ప్రయాణీకులు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం పీలేరు ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులు తమకు కావలసిన, రావలసిన బస్సుల కోసం గంటలకొద్దీ నిరీక్షించక తప్పలేదు. సాధారణంగా పీలేరు-మదనపల్లి, పీలేరు-తిరుపతి మార్గాల్లో ప్రతి మూడు నుండి ఐదు నిమిషాల మధ్య ఒక ఆర్టీసీ బస్సు సర్వీసు సౌకర్యం ఉంది. అలాగే పీలేరు-చిత్తూరు, పీలేరు-రాయచోటి మార్గాల్లో ప్రతి 15 నిమిషాలకూ బస్సులున్నాయి. ఇక గ్రామీణ మార్గాలకు నిర్ణీత సమయాల్లో బస్సులు నడుస్తాయి. పీలేరు ఆర్టీసీ డిపోకు చెందిన 83 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. అవే కాకుండా అటు మదనపల్లి, తిరుపతి డిపోల నుంచి, ఇటు రాయచోటి, చిత్తూరు డిపోల నుంచి కూడా బస్సు సర్వీసులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. అవే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కూడా అడపాదడపా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. శుక్రవారం కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన, బహిరంగ సభలు ఉండడంతో ఆర్టీసీ బస్సులను ఆ కార్యక్రమానికి హాజరయ్యే వైయస్సార్ పార్టీ కార్యకర్తల కోసం దారి మళ్ళించారు. ఇందుకోసం ఒక్క పీలేరు డిపో నుంచే 20 బస్సులను అధికారులు దారి మళ్ళించారు. దానికి తోడు 60 మంది ఆర్టీసీ ఉద్యోగులు శాఖా పరమైన సమావేశానికి హాజరయ్యేందుకు విజయవాడ వెళ్లడం, మిగిలిన ఉద్యోగుల్లో ఒకరిద్దరు అనారోగ్యానికి గురికావడం వంటి సమస్యలతో బస్సు సర్వీసుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం బస్టాండులో గంటలకొద్దీ నిరీక్షించక తప్పని పరిస్థితైంది. వచ్చే బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు పరుగులు తీయడం, బస్సు ముందు ఎక్కిన వారికి మాత్రమే సీట్లు దక్కడం వంటి అనేక సమస్యలను వారు చవిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

    Latest stories